హైదరాబాద్ : బీసీల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక పోరాటాలు చేశారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఈ బిల్లుకు సంబంధించి మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ, సామాజిక, ఆర్థికంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అన్నారు.. రాజకీయ అవసరాలకు సంబంధించి మాత్రమే ఈ బిల్లులో ఉంది. ఆర్థికపరమైన అంశాలు బిల్లులో లేవు. బీసీ సబ్ ప్లాన్ త్వరలోనే పెట్టాలి. బీసీ రిజర్వేషన్ బిల్లును న్యాయపరమైన చిక్కుల్లేకుండా శాస్త్రీయంగా చేయాలని గంగుల కమలాకర్ చెప్పారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీసీల గురించి మా పార్టీ కొత్తగా ఈ రోజు మాట్లాడడం లేదు. కేసీఆర్ 2004లో యూపీఏలో భాగస్వామిగా సంవత్సరన్నర కాలం పని చేశారు. 2004 డిసెంబర్ 17న కేసీఆర్ ఉమ్మడి ఏపీ నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ప్రతినిధి బృందాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడారు. 45 నిమిషాలు సమయం ఇస్తే.. ప్రధాని మరింత టైమ్ ఇచ్చి గంటన్నర పాటు మాట్లాడారు. కేంద్ర మంత్రిగా కేసీఆర్ డిమాండ్ చేసిందంటే.. ఆయా రాష్ట్రాల్లో బీసీ వెల్పేర్ మినిస్ట్రీ ఉంది.. కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉండాలని కోరారు. అప్పుడు అనుసంధానం చేసుకుని పని చేస్తే బీసీలకు మేలు జరుగుతుందని కోరారు. కేంద్ర మంత్రిగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కేసీఆర్. పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తీసుకొచ్చారు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు.
పార్టీలకతీతంగా తెలంగాణ సిద్ధించింది. 2014లో తొలిసారి.. స్పీకర్‌గా బీసీ నాయకుడు మధుసూదనాచారికి అవకాశం కల్పించారు కేసీఆర్. మండలిలో చైర్మన్‌గా స్వామి గౌడ్‌ను ఎంపిక చేశారు. చరిత్రలో తొలిసారి బలహీన వర్గాలకు చెందిన బీఎస్ ప్రసాద్‌ను అడ్వకేట్ జనరల్ చేశాం. ఇప్పుడు సభలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు.. మండలిలో ప్రతిపక్ష నేతగా బీసీ నాయకుడు మధుసూదనాచారి ఉన్నారు. డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ఉన్నారు. బీసీ బిడ్డలకు పదవులు ఇచ్చి మా నిబద్ధత చాటుకున్నాం అని కేటీఆర్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండు సార్లు తీర్మానం చేసి పంపించాం.. ఏకగ్రీవంగా. ఒక తీర్మానం ఏంటంటే జనగణనతో పాటు కుల గణన చేయాలని కోరాం కేసీఆర్ నాయకత్వంలో. అలాగే చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మరోక తీర్మానం చేసి పంపించాం అని కేటీఆర్ తెలిపారు.
ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టం తెచ్చారు. 2010లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది 50 శాతానికి రిజర్వేషన్లు మించకూడదు అని. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తే అది చట్టబద్ధం అవుతుంది. బీసీలకు న్యాయం చేయాలనుకుంటే.. పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీ తలచుకుంటే జరుగుతుంది. 9వ షెడ్యూల్లో చేర్చితేనే పరిష్కారం అవుతుంది. ఇది సీఎం, మంత్రులకు తెల్వదు అనుకోవడం లేదు. కానీ ఇరుక్కుపోయారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో పెట్టినప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పేది ఉండే. కానీ ఆరు నెలల్లో చేస్తామని చెప్పారు. దాంతో బీసీ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, పార్టీ పరంగా, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక, ఇవాళ్నేమో బిల్లు తెస్తున్నారు. ఒకటే పార్టీ ఐదు రకాలుగా మాట్లాడితే బీసీలకు అర్థం అవ్వడం లేదా మీ నిజాయితీ చిత్తశుద్ది. చిత్తశుద్ధి లేని శివపూజ చేస్తూ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు. మేం చిత్తశుద్ధితో రిజర్వేషన్ల కోసం ప్రయత్నించాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.