KTR | హైదరాబాద్ : కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయం ఇవాళ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా స్పష్టంగా కనబడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్ మహానరగం.. ఇవాళ ఈ నగరం అధ్వాన్నంగా మారింది. పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్‌గా మిగిలిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ మంత్రి. నగరంలో చేపట్టిన 42 ఫ్లై ఓవర్లకు గానూ 36 పూర్తి చేశాం. మిగతా 6 పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. ప్రభుత్వ హాస్పిటల్‌ను విధ్వంసం చేశారు. హాస్పిటల్స్‌లో ముందులు దొరకని పరిస్థితి నెలకొందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థ పేకమేడలాగా కుప్పకూలుతుంది. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం.. ఇది బడ్జెట్ ద్వారా స్పష్టంగా కనబడుతుంది. పెద్ద పెద్ద డైలాగులు ట్రిలియన్ డాలర్ చేస్తరట.. ట్రిలియన్ డాలర్ అంటే ఎన్ని సున్నాలున్నాయో కూడా తెలియదు ఈ సన్నాసులకు.. ఎవరో చెబితే వీళ్లు చదివారు తప్ప వీళ్లకు ఉన్నదాన్ని కాపాడే పరిస్థితి లేదు. ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు.. ట్రిలియన్ డాలర్లకు అప్పుజేసే పరిస్థితి కనిపిస్తుంది. పదేండ్లలో కేసీఆర్ 4 లక్షల 17 వేల కోట్లు అప్పుజేస్తే కాంగ్రెస్ పార్టీ కారు కూతలు కోసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకటే ఏడాదిలో ఒక లక్షా 60 వేల కోట్లు అప్పు చేసింది ఇది వాస్తవమని రేవంత్ ఒప్పుకున్నారు అని కేటీఆర్ తెలిపారు.
వీరిది 20 శాతం కమీషన్ పాలన.. దేశానికి సిగ్గుచేటు పాలన.. ఇది ప్రజల కష్టాలను తీర్చే బడ్జెట్ కాదు. ఆరు గ్యారెంటీలను గోవిందా అనిపించి ఢిల్లీకి మూటుల పంపే బడ్జెట్ అని ఆరోపించారు. మీ మొదటి ప్రాధాన్యత వ్యవసాయం కాదు.. ఢిల్లీకి మూటలు పంపడం మీ ప్రాధాన్యత అని అర్థమైంది. రుణమాఫీ చేశామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే శాసనసభ సభ్యత్వాలను వదులుకుంటామని హరీశ్‌రావు, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నేను సవాల్ చేశాం. కానీ కాంగ్రెస్ సర్కార్ ముందుకు రాలేదు. రైతుకూలీలకు ఆర్థిక సాయం చేశామని నమ్మబలుకుతున్నారు. రైతు కూలలీలకు రూ. 12 వేలు ఇచ్చినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.