నల్లగొండ సిటీ, జూన్ 10: వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళ నుంచి బాలుడిని గుర్తుతెలియని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపహాడ్కు చెందిన బైరం అంజిబాబు గర్భిణి అయిన తన భార్య భాగ్యలక్ష్మిని వైద్యం కోసం ఈనెల 8న నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చేర్పించాడు. వీరి వెంట ఏడాదిన్నర బాబు బైరం సోమేశ్‌కుమార్ ఉన్నాడు. కొడుకుతోపాటు ఇంటి పక్కన ఉండే పార్వతమ్మను తన భార్యకు తోడుగా ఉంచి మధ్యాహ్న సమయంలో అంజిబాబు తుంగపహాడ్ వెళ్లాడు. గుర్తుతెలియని ఇద్దరు మహిళలు పార్వతమ్మతో మాటలు కలిపారు.
భోజనానికి వెళ్లిన భాగ్యలక్ష్మి ఎంత కూ రాకపోవడంతో ఆమె కోసం బాబును గుర్తుతెలియని మహిళల వద్ద ఉంచి వెతకడానికి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి బాబుతోపాటు ఆ మహిళలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాలతోపాటు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కెమెరాలు పరిశీలించగా, ఇద్దరు మహిళలు బాబును తీసుకుని భువనగిరి బస్సు ఎక్కినట్టు కెమెరాల్లో నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఏడాదిన్నర బాబు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.