Peddapalli | కోల్‌సిటీ, ఫిబ్రవరి 12: తోటి పిల్లలతో ఆడుతూ.. పాడుతూ పెరగాల్సిన బాలుడికి పెద్ద కష్టమే వచ్చింది. పసిప్రాయంలోనే రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి రావడంతో కన్నవారి హృదయం తల్లడిల్లుతున్నది. తన కిడ్నీ ఇవ్వడానికి తల్లి సిద్ధమైనా, ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు ఖర్చుకానుండటంతో సాయం కోసం తల్లిదండ్రులు అర్థిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్టాండ్ కాలనీకి చెందిన దోనుగు రవీంద్ర-సృజన దంపతుల తొమ్మిదేండ్ల కుమారుడు హర్షవర్ధన్ రెండేండ్ల వయస్సు నుంచే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని దవాఖానలో చూపించగా, వైద్యులు పరీక్షించి రెండు కిడ్నీలు ఎదగడం లేదని గుర్తించారు. కొన్నేండ్లపాటు మందులు వాడాలని సూచించారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న రవీంద్ర ఇప్పటికే బాబు వైద్య ఖర్చుల కోసం దాదాపు రూ.6 లక్షల దాకా అప్పు చేశాడు.
తప్పనిసరిగా కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు చెప్పడంతో బాలుడి తల్లి సృజన తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్‌కు దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో కంగుతిన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేదంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందిస్తే తన కిడ్నీతో బాబును బతికించుకుంటానని ఆ తల్లి వేడుకుంటున్నది. సాయం చేసే దయార్థ హృదయులు గూగుల్ పే నంబర్ 8008605696 లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ 11014475015, ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్0020708, గోదావరిఖనికి పంపించాలని ప్రాథేయపడుతున్నది.