సంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ జాతి పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ అని అభివర్ణించారు. జాతీయ పార్టీలు వికృత పార్టీలని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధన్న పాటిల్, శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు నాగరాజు తమ అనుచరులతో టీఆర్ఎస్లో చేరారు. హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు రెండూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. సమైక్య పాలనలో పదేండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఏడేండ్లుగా కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ సైతం తెలంగాణకు తీరని నష్టం చేస్త్తున్నదని మండిపడ్డారు. అబద్ధ్దాలకు నోబెల్ బహుమతి ఉంటే అది బీజేపీకి దక్కుతుందని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావడం లేదంటే, అంతకన్నా జూటా మాట మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు పైసలు ఇస్తున్నామని బీజేపీ గొప్పలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, దళితబీమా పథకాల్లో ఒక్కరూపాయి కూడా కేంద్రం ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని గుర్తుచేశారు. తెలంగాణ రాకపోతే, సీఎంగా కేసీఆర్ లేకపోతే సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చేదా? అని అడిగారు. స్వరాష్ట్రంలో మనం లేకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాకుంటే సంగారెడ్డి జిల్లాకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఏర్పాటయ్యేవా, గోదావరి జలాలు వచ్చేవా? అన్నారు. తెలంగాణ కోసం పని చేసే పార్టీ వైపు ఉండాలో, హాని చేసే పార్టీ వైపు ఉండాలో ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తిచేశారు.