సూర్యాపేట : వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం వల్ల కుటుంబ సభ్యుల అభ్యంతరంతో ఇరువురు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని ఆత్మకూరు.ఎస్ మండలం తుమ్మలపెన్ పాడ్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన లావణ్య(28)కు పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ దశలో గ్రామానికి చెందిన చింతపల్లి మహేశ్(25)తో మూడేండ్ల క్రితం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.
వీరి విషయం బయటకు పొక్కడంతో కులపెద్దలు పంచాయతి నిర్వహించి పెళ్లయిన మహిళతో సంబంధం ఏమిటని నిలదీశారు. మరోసారి ఇటీవల ఇద్దరి కుటుంబ సభ్యులు వీరిని హెచ్చరించడంతో శనివారం మధ్యాహ్నం నుంచి ఇద్దరు కనిపించకుండా పోయారు. భార్య లావణ్య కోసం సాయంత్రం వరకు వెతికినా జాడ కనిపించకపోవడంతో ఆమె భర్త రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఆధారంగా వారి లొకేషన్‌ను గుర్తించారు. మొబైల్ లొకేషన్ సహాయంతో కుటుంబ సభ్యులు, పోలీసులు మహేశ్ కౌలు చేస్తున్న వ్యవసాయం వద్దకు వెళ్లి పరిశీలించగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.