కరీంనగర్ :జ్ఞాన సంపదను భద్రపరిచేది, భావితరాలకు జ్ఞానాన్ని అందించేది పుస్తకమనేనని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూగుల్(Google ని మించిన సమాచారం పుస్తకాల్లో లభ్యమవుతుందని అన్నారు. పుస్తకాలను భావి తరాలకు అందించి, పుస్తక ప్రాముఖ్యతను పెంచడానికి పుస్తక మహోత్సవం తోడ్పడుతుందని అన్నారు. తరతరాల చరిత్రను సంపదను భద్ర పరచి, కీర్తించుకుంటామంటే పుస్తకాల ద్వారానే అని అన్నారు. స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన ఉద్యమాల పుస్తకాలను చదివి ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి విజయం సాధించారని అన్నారు.
కరీంనగర్ జిల్లా ఖ్యాతిని పెంచిన మహనీయులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక స్థితిని గాడిన పెట్టింది పుస్తక పఠనం తోనే అని గుర్తు చేశారు. జిల్లాకు చెందిన అనేక మంది గొప్ప గొప్ప సాహితీ వేత్తలు పుస్తక పఠనం ద్వారానే కీర్తి ప్రతిష్టలను పొందారని గుర్తు చేశారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని అన్నారు.