హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.1200 కోట్లు రాష్ట్ర సర్కారు రైతులకు బాకీ పడింది. యాసంగిలో సన్నరకం ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు. రేవంత్ సర్కార్ బోనస్ ఇస్తుందని ఆశపడితే.. ముప్పుతిప్పలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఒక్క రూపాయి ఇవ్వలే..
యాసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి 71 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో సుమారు 24 లక్షల టన్నుల సన్న ధాన్యం ఉన్నది. కాంగ్రెస్ హామీ మేరకు సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉన్నది. ఈ లెక్కన 24 లక్షల టన్నులకు సుమారు రూ.1,200 కోట్ల మేర రైతులకు బోనస్ చెల్లించాల్సి ఉన్నది. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వం మాత్రం సన్నాల బోనస్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని ప్రకటనలు చేస్తున్నది.
కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం. సర్కారు బోనస్ పైసలిస్తే వానకాలం పెట్టుబడికి ఉపయోగపడతాయని భావించినట్టు రైతులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు ఓ వందకు తక్కువకు ఇచ్చినా ఇప్పటికే పైసలు చేతికొచ్చేవని చెబుతున్నారు. ధాన్యం డబ్బుల చెల్లింపుల విషయంలో ప్రైవేట్ వ్యాపారులను మించి ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బోనస్ పైసలు ఆలస్యం చేస్తుండడంతో ఆ పైసలు బయట తెచ్చిన అప్పుల మిత్తికే సరిపోతాయని, బోనస్ ఇచ్చి లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. సర్కారు తీరు చూస్తుంటే సన్నాలు వేయాలంటేనే భయంగా ఉందని వాపోతున్నారు.