మాచారెడ్డి, డిసెంబర్ 4 : సర్పంచ్ ఎన్నికల్లోనూ బాండ్ పేపర్ ట్రెండ్ మొదలైంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన గోనె శివాని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనను గెలిపిస్తే కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతోపాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలోపు ఈ రెండు హామీలను నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని బాండ్ పేపర్ రాసి ఓటర్లకు అందజేస్తున్నారు.
ఏటూరునాగారం, డిసెంబర్ 4 : ములుగు జిల్లా ఏటూరునాగారం సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థి వినుకోల్లు ధనలక్ష్మి ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. తన హామీలను బాండ్ పేపర్‌పై రాసి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏటూరునాగారంలో వైఫై నెట్‌వర్క్‌తోపాటు టీవీ చానళ్లు ఐదేండ్లపాటు ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. దీంతోపాటు మరికొన్ని హామీలు కూడా అందులో పొందుపరిచారు.