హైదరాబాద్: విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతూనే ఉన్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు థ్రెట్స్ వచ్చాయి. తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన మూడు విమానాలకు, ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో విమానాలకు ఐసోలేషన్ బేకు తరలించి పరిశీలిస్తున్నారు. గోవా నుంచి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.
ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి పుణెకు వెళ్తున్న ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాలకు ఐసోలేషన్‌కు తరలించి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అవన్నీ ఫేక్ కాల్స్‌గా నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
కాగా, దేశీయ విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో.. వీటి దర్యాప్తులో ఇంటర్‌పోల్, ఎఫ్‌బీఐని భారత్ సహాయం కోరింది. దీనికి అమెరికా సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. వేర్వేరు ప్రాంతాల నుంచి సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఈ మెయిల్స్‌ను ట్రాక్ చేసేందుకు సహకరించనుంది. మరోవైపు జర్మనీ, యూకే నుంచి సమాచార సేకరణకు సాయం చేయాలని భారత బృందం ఇప్పటికే ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేసింది.