హైదరాబాద్, ఆగస్టు 11(నమ స్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌లో నిర్వహించి న వరుణయాగం ప్రజల సంక్షేమం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నీటి నిర్వహణలో ఘోరంగా విఫలమైందని, మానవ ప్రయత్నం చేయకుండా వర్షాలు కురువాలని దేవునిపై భారం వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నదని విమర్శించారు. ఎల్ నినో హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక లేకుండా, నీళ్లున్నా లిఫ్ట్ చేయకుండా రైతాంగాన్ని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన వాటాను వినియోగించుకోలేని అసమర్థ పాలన తెలంగాణలో సాగుతున్నదని మల్లయ్యయాదవ్ మండిపడ్డారు. రాష్ట్ర హకులను ఏపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తుంగభద్ర, భీమా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై రేవంత్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆరోపించారు. సొంత నియోజకవర్గానికి లిఫ్ట్ కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ అన్యాయం చేశారని పేర్కొన్నారు.
ఉత్తమ్ సొంత జిల్లాకే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెకుల నీరు వృథాగా సముద్రంలోకి పోయినా చూస్తూ ఉండి, ఇప్పుడు వరుణయాగం పేరి ట దేవునిపై భారం వేయడం ఏంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల మీద ఉన్న ధ్యాస, రైతుల సంక్షేమంపై లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రవినాయక్, ఫ యాజ్ తదితరులు పాల్గొన్నారు.