హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరంను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. మేడిగడ్డ బరాజ్‌లో మూడు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టే పనికిరాదనే రీతిలో మాట్లాడటం సీఎం అవగాహన రాహిత్యానికి పరాకాష్టగా అభివర్ణించారు.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం 14 టీఎంసీలతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి డిజైన్ చేస్తే, దాని సామర్థ్యాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ 141 టీఎంసీలకు పెంచారని వివరించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణానికి 4,613 కోట్లు, అన్నారం బరాజ్‌కు 2,734.81 కోట్లు, సుందిళ్ల బరాజ్‌కు 2,111.10 కోట్లు ఖర్చు అయిందని వివరించారు.
గోదావరి నీటిని మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తు నుంచి 620 మీటర్ల ఎత్తు వరకు పంపింగ్ చేస్తూ మొత్తం 141 టీఎంసీల నీరు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నిల్వ అవుతుందని వివరించారు. ప్రాణహిత చేవెళ్లలో భాగమైన ఎల్లంపల్లి రీ ఇంజినీరింగ్ తర్వాత ఇప్పుడు కాళేశ్వరంలో భాగమైందని వివరించారు.