కరీంనగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీఎంపీ వినోద్‌కుమార్ (Boinapally Vinod Kumar) డిమాండ్ చేశారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని, కాలయాపన చేయకుండా పనులు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రాణిహిత నుంచి నీటిని ఎత్తిపోసి.. పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లేఖలోని వివరాలు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు యాసంగి పంటకు మీరు నీళ్లు ఇవ్వలేమని గత డిసెంబర్లో అధికారులతో ప్రకటన చేయించారు. తాజాగా రైతు సమితి చైర్మన్ కోదండరెడ్డి పంటలు వేయొద్దని రైతులకు సూచనలు చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నది. ఏడాది పాలనలో అద్భుతాలు సృష్టించామని మీరు విజయోత్సవాలు చేసుకున్నప్పటికీ.. వేసవి పంటల కోసం ఉత్తర తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వలేమనటం మీ ప్రభుత్వ వైఫల్యమే. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా పంట దిగుబడి సాధించామని మీ మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే కాదు, కాళేశ్వరం మేడిగడ్డ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపూర్ వరకు ఉన్న అనేక ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల, పంప్ హౌజ్‌ల సంగమం. ఒక బ్యారేజీలు నీళ్లు నిల్వ చేయకపోయినా మిగతా ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్లు అందుతున్నాయన్న విషయాన్ని మర్చిపోవటం హాస్యాస్పదం. అది కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థపై మీకు, మీ నాయకులకు అవగాహన లేమికి నిదర్శనం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో అప్పటి వైఎస్ ప్రభుత్వం దోసిళ్లతో నీళ్లు ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అనేక రిజర్వాయర్లతో కాళేశ్వరాన్ని పెద్ద నీటి తాంబాలంగా మార్చారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ తొలి ప్రభుత్వం గత పదేండ్లలో రికార్డు స్థాయిలో వరి దిగుబడిని పెంచితే.. మీరు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కనీసం పంటకు నీళ్లు ఇవ్వలేని దుస్థితిని తీసుకువచ్చారు. మేడిగడ్డ బ్యారేజీపై రాజకీయాలు చేస్తున్న మీ ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలనుకోవడంలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. మరమ్మతులకు నేషనల్ డ్యామ్ సిఫ్టీ అథారిటీ అనుమతులకు సంబంధం లేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టంలో స్పష్టంగా ఉన్నది. ప్రాజెక్టుల పూర్తి బాధ్యత డ్యామ్ ఓనర్ దేనని ఆ చట్టం చెప్తుంటే.. కాళేశ్వరం విషయంలో డ్యామ్ ఓనర్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తున్నది. చట్టం ప్రకారం రాష్ట్రంలో కూడా స్టేట్ డ్యాం సిఫ్టీ అథారిటీ ఉన్నదన్న విషయాన్నే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందులో కూడా నిపుణులైన ఇంజనీర్లు ఉన్నారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా లాంటి నిపుణులు సలహాదారులుగా ఉన్నారు. కేవలం సూచనలు, సలహాల కోసం మాత్రమే నేషనల్ అథారిటీ ఉన్నదన్న విషయం మీకు, మీ మంత్రివర్గ సహచరులకు తెలిసి కూడా ఈ కాలాయాపన చేయటం రైతులను దగా చేయడమే.
లక్షల ఎకరాలను తడిపే ఉద్దేశంతో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ తొలి ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకోవటం మీ ప్రభుత్వ కుత్సిత బుద్ధికి నిదర్శనం. మీ అసమర్ధత, మీ చేతకానితనం వల్ల వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి.మీ ప్రభుత్వ వైఫల్యం గురించి తెలియని అమాయక రైతులు యాసంగి పంటకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రైతులు నీళ్ల కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదు. గత ప్రభుత్వ పాలనలో వడ్ల దిగుబడి రెట్టింపు అయ్యిందన్న విషయాన్ని మీకు మరోసారి గుర్తుచేస్తున్నాను. దేశంలోనే ధాన్యం దిగుబడిని సాధించి మొదటిస్థానంలో నిలిచిన తెలంగాణ రైతులు మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని నీళ్లు లేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. మహారాష్ట్ర తర్వాత పత్తి దిగుబడిలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకబడేలా చేయకండి. తెలంగాణ ఏర్పడ్డాక గోదావరి, కృష్ణా నదులపై అప్పటి ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ఎక్కువ శాతం సాగు ప్రాంతం పెరిగిందన్న విషయం మీకు తెలియనిది కాదు. ఎంతోమంది రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు కింద పంటలు సాగుచేసి తమ బిడ్డల చదువులు పూర్తిచేశారు. కానీ, మీ ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా నేషనల్ డ్యామ్ సిఫ్టీ అథారిటీ అనుమతుల కోసం చూస్తున్నామన్న నెపంతో ఆలస్యం చేయటం సరికాదు.
నేషనల్ డ్యామ్ సిఫ్టీ చట్టం ప్రకారం… ప్రాజెక్టులను మరమ్మతులు చేసుకోవటానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆ అథారిటీ సూచనలు మాత్రమే చేస్తుంది. స్టేట్ డ్యాం సిఫ్టీ అథారిటీ (State Dam Safety Authority) కూడా చట్టం ప్రకారమే ఏర్పాటైనది కాబట్టి వారి సూచనల ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతే కానీ, నేషనల్ డ్యాం సిఫ్టీ అథారిటీ నివేదిక వచ్చేదాకా నిర్ణయాలు తీసుకోకూడదని మీరు, మీ నీటిపారుదల శాఖ మంత్రి భావించడం తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇటీవల మేడిగడ్డ ప్రాంతంకేంద్రంగా భూకంపం వచ్చినా, రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రత నమోదైనా ఆ ప్రాజెక్టుకు ఏం కాలేదు. అలాంటి మేడిగడ్డకు మీరు ఎలాంటి మరమ్మతులు చేయకుండా తాత్సారం చేయటం రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి లేఖ రాసి అంశాన్ని రాష్ట్రం పరిధి నుంచి కేంద్రం పరిధిలోకి తీసుకుపోయారు. వారు కోరిన విధంగానే నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ నివేదికను వండి వార్చిన సంగతి అందరూ గమనించినదే. దీంతో రాష్ట్ర రైతుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. దీనికి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన నిర్వాకమే. ఎన్నికల తర్వాత మీరు ఆ ఉచ్చులో నుంచి బయటపడలేక నిష్క్రియాపరత్వంలోకి జారిపోయి రైతాంగానికి ద్రోహం చేస్తున్నారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పాక్షిక కుంగుబాటును చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించేందుకు ఈ ఏడాది కాలంలో మీరు చేయని ప్రయత్నం లేదు. అయినా మీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సఫలం కాలేకపోయాయి. ఇప్పటికైనా కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేసి రైతుల పొట్ట కొట్టవద్దని మీకు మనవి చేస్తున్నా.కాబట్టి మీరు వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచన చేయాలి. అంతేకాదు, రాష్ట్ర సాగునీటి అధికారులతో, స్టేట్ డ్యాం సెఫ్టీ అథారిటీ అధికారులతో చర్చించాలి. తద్వారా బ్యారేజీల శాశ్వత మరమ్మతులు పూర్తిచేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. రానున్న రోజుల్లోనైనా రైతులకు నీళ్లందించే కార్యాచరణకు పూనుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను.