హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు ఇకనైనా కండ్లు తెరిచి తెలంగాణ అభివృద్ధిని చూడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హితబోధ చేశారు. తెలంగాణ అనతికాలంలోనే తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఆదినుంచి తెలంగాణను అన్నివిధాల అణగదొక్కాలని చూస్తున్నదని, కానీ తెలంగాణ మాత్రం అన్నింటా తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతికి, పటిష్ట ప్రణాళికకు ఏప్రిల్ నెల జీఎస్టీ వసూళ్లే నిదర్శనమని చెప్పారు. సుమారు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఏప్రిల్ నెలలో రూ.5,622 కోట్ల జీఎస్టీ వచ్చిందని తెలిపారు. కానీ.. సుమారు 24 కోట్లమంది జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కేవలం రూ.10,320 కోట్లు మాత్రమే వసూలైందని చెప్పారు.
జనాభా ప్రాతిపదికన చూస్తే తెలంగాణతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో సుమారు రూ.30 వేలకోట్ల జీఎస్టీ వసూలు కావాలని పేర్కొన్నారు. కానీ, తెలంగాణతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో ఐదురెట్లు తక్కువ జీఎస్టీ వసూలైనట్టేనని తెలిపారు. ఈ లెక్కలన్నీ తాను చెబుతున్నవి కాదని, స్వయంగా కేంద్రమే పీఐబీ ద్వారా వెల్లడించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కంటే వయస్సులోనూ, జనాభాలోనూ ఎంతో చిన్నదైన తెలంగాణ ఆర్థికరంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. రూ.3.17 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. రూ.12.93 లక్షలతో జీఎస్డీపీలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని తెలిపారు. ఇటీవలే.. తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ విధానాలను ఉత్తరప్రదేశ్ వాణిజ్యపన్నుల బృందం వచ్చి పరిశీలించి పోయిందని గుర్తు చేశారు.
తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఎంతో బాగున్నాయని ఉత్తరప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ బృందం కితాబిచ్చిన సంగతి ఎలా మరుస్తారు? అని నిలదీశారు. ఇవన్నీ తెలంగాణలోని బీజేపీ నేతలకు కనిపించకపోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి కండ్లు సరిగా కనిపించటం లేదని, కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమానికి వెళ్లి కంటిపరీక్ష చేయించుకోవాలని సూచించారు. అప్పుడైనా.. దేశమంతా కీర్తిస్తున్న తెలంగాణ ప్రగతి కండ్లకు కనిపిస్తుందని చెప్పారు.