ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్‌గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్ (టిస్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, న్యూఢిల్లీ (ఎన్ఐయూఏ) సంయుక్త భాగస్వామ్యంతో రెండు కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలను ఆవిష్కరించిన సందర్భంగా ఆదివారం ఆయన రెండు ఇన్స్టిట్యూట్ల డైరెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్‌గా శరవేగంగా ముందుకు సాగుతోందని, ఈ రెండు కొత్త ప్రోగ్రాంలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో పట్టణీకరణ పెద్ద సవాలుగా మారిందని, దీనికి ఈ రెండు కోర్సుల ద్వారా మంచి పరిష్కార మార్గం సూచించే అవకాశాలుంటాయని అభిప్రాయపడ్డారు. ప్లానింగ్, ఇన్స్టిట్యూషన్స్, సిటీ ఫైనాన్స్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లాంటి ఐదు ప్రధాన అంశాలపై పీజీ కోర్సు ఆవిష్కరించడం గొప్ప విషయమని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. టిస్ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలిని భరత్, అర్బన్ ఇన్స్టిట్యూట్ సంస్థ డైరెక్టర్ హితేష్ వైద్య, తదితరులున్నారు.