జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్చోరీ లీలలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రతినిధులు చేపడ్తున్న క్షేత్రస్థాయి పరిశీలనల్లో దొంగ ఓట్లు కుప్పలుతెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. ఏ గల్లీని కదిలించినా వందలాదిగా బోగస్ ఓట్లు బయటకు వస్తున్నాయి. రెండు ఫ్లోర్లు దాటిన ఏ ఇంట్లో చూసినా పదుల సంఖ్యలో దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, అల్లాపూర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో (Jubilee Hills) బోగస్ ఓట్లు (Fake Votes) కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడని వాళ్లు, ఎప్పుడూ అక్కడ నివసించని వారు ఓట్లు కలిగి ఉంటున్నారు. ఆ చిరునామా కలిగిన యజమానులు తమకు తెలియకుండా తమ ఇంట్లో వీళ్లెప్పుడున్నారని అవాక్కవుతున్నారు. తాజాగా బోరబండ డివిజన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బడుగుల లింగయ్య యాదవ్ బృందం తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఒకే గల్లీలోని నాలుగు ఇండ్లను పరిశీలించగా ఏకంగా 99 దొంగ ఓట్లు వెలుగు చూశాయి. వారంతా స్థానికేతరులే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. బీఆర్ఎస్ ప్రతినిధులు బోరబండ డివిజన్లోని బంజారానగర్ కవిత పబ్లిక్ స్కూల్ లేన్‌లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అక్కడున్న ప్రతి ఇంటిలో కనీసం ఒక్కటైనా బోగస్ ఓటు ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా నాలుగు ఇండ్లను తనిఖీ చేస్తే 99 దొంగ ఓట్లు బయటపడ్డాయి.
కవిత స్కూల్ లేన్‌లోని ఇంటి నంబర్ 8-4-369/338లో మొత్తం 42 ఓట్లున్నట్టు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో ఉంది. కానీ ఇంటి యజమాని సదాశివాచారి మాత్రం తమ ఇంట్లో ఏడుగురికి మాత్రమే ఓటు హక్కు ఉన్నదని తేల్చారు. మిగిలిన ఓట్లతో తమకు సంబంధం లేదని చెప్పారు. అదీగాక తమ ఏడు ఓట్లు మినహాయించి నమోదైన ఓట్లర్లందరూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారుగా జాబితాలో ఉంది. గత 40 ఏండ్లుగా కవిత పబ్లిక్ స్కూల్ లేన్‌తో పాటు బంజారానగర్‌లో అసలు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే లేరని, తమ ఇంట్లో కూడా అద్దెకు ఇప్పటి వరకు ముస్లింలు లేరని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 8-4-369/335 ఇంటి నంబర్లో 27 ఓట్లుండగా అందులో 22 ఓట్లు బోగస్ అని తేలింది. అదేవిధంగా ఇంటి నంబర్ 8-4-369/343లో 40 ఓట్లుండగా అందులో 35 ఓట్లు దొంగ ఓట్లేనని గుర్తించారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు చనిపోయినా తొలగించకుండా కొనసాగిస్తున్నారు. 8-4-369/346 నంబర్ ఇంట్లో 8 మంది ఉన్నారు. అయినా ఆ ఇంటి చిరునామాతో మరో 7 బోగస్ ఓట్లను జాబితాలో చేర్చారు. ఇలా బంజారానగర్లోని కవిత పబ్లిక్ స్కూల్ లేన్ మొత్తం బోగస్ ఓట్టు ఉన్నట్టు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండా తమ చిరునామాతో ఓట్లెలా చేరుస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముస్లింలే లేని ప్రాంతంలో ఆ ఓట్లెలా చేరాయి?
బోరబండ డివిజన్ బంజారానగర్లోని కవిత పబ్లిక్ స్కూల్ పరిసరాలైన మూడు లేన్లలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదని ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా కవిత పబ్లిక్ స్కూల్ లేన్‌లో 50 పైగా ఇండ్లుండగా ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. కానీ ఆయా ఇండ్ల చిరునామాలతో పదుల సంఖ్యలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు నమోదయ్యాయి. ఆ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో బోగస్ ఓట్లు నమోదవుతుంటే ఎలక్షన్ కమిషన్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, బీఎల్వోలు ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. వందల కొద్దీ బోగస్ ఓట్లు జాబితాలో చేరడం వెనుక ఆంతర్యమేంటని మండిపడుతున్నారు. సరైన విచారణ, తనిఖీ చేపట్టకుండానే తుది జాబితా విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. తమ చిరునామాలతో గతంలో దొంగ ఓట్లు లేవని, ఇటీవల విడుదల చేసిన జాబితాలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి తమ చిరునామాలతో ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మా ఇంట్లో ఉన్నది ఏడు ఓట్లే
బోరబండ డివిజన్లోని కవిత పబ్లిక్ స్కూల్ లేన్‌లో 8-4-369/338 ఇంటి నంబర్ మా చిరునామా. మా ఇంట్లో మొత్తం ఏడుగురికి మాత్రమే ఓటు హక్కు ఉంది. మేం ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ముస్లింలకు అద్దెకు ఇవ్వలేదు. మా కాలనీలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. కానీ మా ఇంటి చిరునామాతో 35 మంది ముస్లింలకు ఓట్లున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఉంది. మాకు తెలియకుండా మా ఇంటి చిరునామాతో అంత మంది ఓట్లెలా నమోదు చేశారు? నమోదైన ఓటర్లలో ఒక్కరిని కూడా నేను గతంలో కూడా చూడలేదు. బోరబండ డివిజన్‌లోనే కాదు మరెక్కడా వారిని మేం చూడలేదు. ఓటర్ల జాబితా మరీ ఇంత తప్పుల తడకగా వస్తుంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారు? -సదాశివాచారి, బోరబండ