Nadargul | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): నాదర్గుల్లోని రైతుల భూములపైకి రోజుకొకటి గద్దల్లా వచ్చి చేరిన కంపెనీ పేర్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఆ భూముల చుట్టూ రేకులతో ఏర్పాటు చేసిన ప్రహరీ మెయిన్ గేట్పై గత కొద్దిరోజులుగా కోహినూర్ కంపెనీ పేరు ఉండగా దాని పక్కన మేఘా-శిల్పా ఇన్ఫ్రా పేర్లను చేర్చారు.
ఇష్టానుసారంగా ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ తమ పేర్లను ఏర్పాటు చేసుకున్నాయి. రూ.6 వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలు విచ్చలవిడిగా ఆక్రమించి ఇష్టాసారంగా బోర్డులు ఏర్పాటు చేసుకున్నాయి. ఏకంగా మూడు కంపెనీలు సంయుక్తంగా డెవలప్ చేస్తున్నట్టు రాసుకున్నాయి. తాజాగా గురువారం ఆ కంపెనీల పేర్లు మాయం అయ్యాయి. వాటిని పూర్తిగా తొలగించేసి గేట్పై వైట్ పెయింట్ వేశారు.
ఆ బోర్డులను రాత్రికి రాత్రి ఎవరు తొలగించారు? గుట్టు చప్పుడు కాకుండా ఎవరూ లేని సమయంలో పేర్లను తొలగించాల్సిన అవసరం ఏముంది? రైతులు రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం, కబ్జా వ్యవహారాన్ని బయటపెట్టిన ‘నమస్తే’ కథనంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందా? ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిన విషయం బయటపడటంతో ప్రభుత్వమే చడీ చప్పుడు లేకుండా పేర్లు తొలగించేసిందా? లేదంటే కబ్జా వ్యవహారం మరింత ముదరకముందే వెనక్కి తగ్గితే బాగుంటుందని భావించి ఆయా కంపెనీలే తమ పేర్లను చెరిపేశాయా? అనే చర్చ జోరుగా సాగుతున్నది.