KTR | హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఓ పిరికి సన్నాసి. దర్శనం వెంకటయ్య అనే ఒక దళిత వృద్ధున్ని తీసుకుపోయి జైల్లో పెట్టించాడు. సోషల్ మీడియా కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రజలు విమర్శిస్తే ఫీడ్ బ్యాక్ లాగా తీసుకోవాలి. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ దేశంలో ఆయా రామ్.. గయా రామ్ ఫిరాయింపుల సంస్కృతిని తీసుకువచ్చింది హర్యానాలో నాటి ఇందిరా గాంధీ. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి మేం పోటీ చేశాం. 26 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ తరపున గెలిస్తే అందులో పది మందిని కాంగ్రెస్ పార్టీ గుంజుకుంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్. మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ గుంజుకుంది అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టాల్సిన అవసరం లేదు. ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి కూలిపోతుంది. రేవంత్ రెడ్డి చేస్తున్న లుచ్చా పనులకు ప్రజలే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాలి. రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా అయితే మరో 20 ఏళ్ల వరకు ఎవరు కాంగ్రెస్కు ఓటు వేయరు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన ఎజెండా మాకు లేదు. అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని ప్రజలే రోడ్డుపై నిలదీస్తారు.. ఇంతకంటే పెద్ద పెద్ద నియంతల్ని ప్రజలు మట్టిలో కలిపారు అని కేటీఆర్ పేర్కొన్నారు.