వరంగల్‌చౌరస్తా, సెప్టెంబర్ 21 : వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల విషయం లో ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంజీఎంహెచ్ సిబ్బంది ఓ పాజిటివ్ గ్రూపు రక్తానికి బదులుగా బీ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించి బాధితురాలిని ప్రాణాపాయస్థితికి చేర్చిన ఘటనలో వైద్యాధికారుల తీరు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం ప్రాంతానికి చెందిన ఇలాసాగరం జ్యోతి ఈ నెల 16న జ్వరంగా ఉన్నదని ఎం జీఎంహెచ్‌లో చేరింది. బాధితురాలికి రక్తహీనత ఉన్నదని పరీక్షించి.. ఓ పాజిటివ్ గ్రూ పునకు బదులుగా రెండు ప్యా కెట్ల బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించిన విషయం బయటపడటంతో వైద్యాధికారులు, సి బ్బంది తమని తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
బాధితురాలికి వైద్య సేవలు అందించలేమని, వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌కి తరలించాలని ఆదేశించడంతో కుటుంబసభ్యులు ఆందోళనచెందుతున్నారు. అప్పటివరకు ఇంటి పనిచేసుకున్న జ్యోతిని ఎంజీఎం దవాఖానకు తీసుకురావడమే శాపమైందని బాధితులు కంటతడి పెడుతున్నారు. జ్యోతి పూర్తిగా ఎంజీఎం సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని ఎంజీ ఎం దాటించి చేతులు దులిపేసుకునే ప్రయత్నాలు మొ దలుపెట్టారు. ఎంజీఎంహెచ్‌లో సరైన వైద్య నిపుణులు అందుబాటులో లేరని, తాము వైద్యం చేయలేమని, అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని, నిమ్స్‌కి తీసుకువెళ్లాలని ఉచిత సలహాలు ఇవ్వడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
‘ఖర్చు లు భరించే స్థితిలో లేమని, మీరే వైద్యం చే యాలని కాళ్లావేళ్లా పడినా పట్టించుకోవడం లేదు’ అని బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఎంజీఎంహెచ్‌లో చేరిన సమయానికి ఆరోగ్యస్థితి, రక్తం ఎక్కించిన తదుపరి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని పోలీసుల సమక్షంలో వివరిస్తూ నిమ్స్ వైద్యాధికారులకు లిఖిత పూర్వక లేఖ ద్వారా రిఫరెన్స్ లెటర్ అందించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారు. పోలీసుల ముందు అందుకు అంగీకరించారు. అయితే పోలీసులు వార్డు దాటిన వెంటనే.. ఎంజీఎంహెచ్‌లో వైద్యం అందించే సమయంలో జరిగిన తప్పిదంపై నిమ్స్ వైద్యాధికారులకు ఫోన్లో వివరిస్తామని, లేఖ రాసి ఇవ్వడానికి వైద్యులు ససేమిరా అంటున్నారని బాధితురాలి భర్త రాజు తెలిపారు.
ఈ విషయమై శాఖాపరమైన విచారణ చేపడుతామంటున్నారని, కానీ జ్యోతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నోరు మెదపడం లేదని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ సరైన రీతిలో స్పందించకపోవడం రోగులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఓ వైపు ప్రాణాలు పోతున్నా, విచారణల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు కానీ వైద్యం చేయడం లేదని మండిపడుతున్నారు.