SLBC Tunnel | ‘ఎస్సెల్బీసీ పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది’ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి..
కాసేపు ఈ వ్యాఖ్యలు నిజమనే అనుకొందాం..
కాంగ్రెస్‌కు పేరురావొద్దని నిజంగా కేసీఆర్ ప్రభుత్వం అనుకొందని భావిద్దాం.
అయితే, ఉమ్మడి రాష్ట్రంలో రూపకల్పన జరిగి, పనులు మొదలై పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్… ప్రాజెక్టులను కూడా హస్తంపార్టీకి పేరురావొద్దన్న సాకుతో అదే కేసీఆర్ ప్రభుత్వం పడావుపెట్టాలిగా? ఆ ప్రాజెక్టులు మూలన పడాలిగా??
కానీ, ఏం జరిగింది??
రాకెట్ వేగంతో ఆయా పెండింగ్ ప్రాజెక్టులు.. రన్నింగ్ ప్రాజెక్టులుగా మారి పాలమూరు తలరాతే మారిపోయింది. దీన్నిబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే కేసీఆర్ ప్రభుత్వానికి ముఖ్యంగానీ, రాజకీయ ప్రయోజనాలు కాదన్నది ఇక్కడ సుస్పష్టమవుతున్నది. రేవంత్ సర్కారు దుష్ప్రచారం రాజకీయ హైడ్రామా అని తేటతెల్లమవుతున్నది. ఎస్సెల్బీసీని చిత్తశుద్ధితో పూర్తిచేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అమిత ప్రాధాన్యతనిచ్చింది. ఉమ్మడిపాలనలో అనాలోచిత ప్రభుత్వ నిర్ణయాలతో తీసుకొచ్చిన పీటముడిలాంటి ఎస్సెల్బీసీని ఎంతో శ్రమించి ఓ దారిలోకి తెచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు తనవంతు ప్రయత్నం చేసింది. అందుకే 11.48 కిలోమీటర్ల సొరంగ నిర్మాణంతో పాటు రెండు రిజర్వాయర్లు పూర్తయ్యాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 4 (నమస్తే తెలంగాణ): భూసేకరణ మొదలు నీటి కేటాయింపుల వరకు పాలమూరు ప్రాజెక్టుల్లో నెలకొన్న ఎన్నెన్నో చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పింది అప్పటి కేసీఆర్ సర్కారు. దాని ఫలితమే తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలోపే పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. అదేరీతిన ఎస్సెల్బీసీ పనులకూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే 11.48 కిలోమీటర్ల సొరంగ నిర్మాణంతో పాటు రెండు రిజర్వాయర్లను దాదాపుగా పూర్తి చేసింది. అయినా తొమ్మిదిన్నర కిలోమీటర్ల పనులు పెండింగులో ఉండటానికి కారణం… టీబీఎం టెక్నాలజీ రూపంలో ఉన్న పీటముడి! దీనికి తోడు కాంగ్రెస్ హయాంలో టెండర్లు దక్కించుకొని గుదిబండలా తయారైన నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ నిర్వాకం. ఇవన్నీ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పెద్దలకు తెలియనివి కావు… కాకపోతే 15 నెలల్లో 18 మీటర్ల సొరంగాన్ని తవ్వి దానిని సైతం కుప్పకూల్చి చివరకు ప్రాజెక్టు భవితవ్యాన్నే ప్రశ్నారక్థకంగా మార్చిన తమ ఘనకార్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నోటికి పని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడడుగులు ముందుకు… ఆరడుగులు వెనక్కి! అన్నట్లుగా సాగిన సొరంగం పనుల తీరును ఓసారి పరిశీలిస్తే… తెలంగాణకు గ్రావిటీ మీద కృష్ణాజలాలు పారకుండా ఉండేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి గుదిబండను తగిలించిందోనన్న వాస్తవం అర్థమవుతుంది.
ఎస్సెల్బీసీ పనుల్లో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా… తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు కాదు! కాగితాలపై నిధులు ఇచ్చామని చెప్పుకునేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారనేది బహిరంగ రహస్యం. దశాబ్దాల కిందటనే రూపదిద్దుకున్న ఈ ప్రాజెక్టును అటకెక్కించి… ఆ తర్వాత వచ్చిన శ్రీశైలం కుడిగట్టు, తెలుగుగంగ ప్రాజెక్టులను నెత్తిన పెట్టుకొని తీరం చేర్చిన గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తరాజులో చూపేందుకు ఎస్సెల్బీసీని మొదలుపెట్టింది. ఒకటీ అరా కాదు… ఏకంగా 44 కిలోమీటర్ల సుదీర్ఘ సొరంగం, అందునా మధ్యలో ఏ ఒక్కచోటనైనా బయటికి వెళ్లేందుకు ఒక్క ఆడిట్, షాఫ్ట్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో (ఈపీసీ) టెండరు దక్కించుకున్న జేపీ సంస్థ పూర్తిగా సబ్ కాంట్రాక్టులతోనే నెట్టుకొస్తున్నది.
టీబీఎం ద్వారా సొరంగ నిర్మాణాన్ని తొలుత చైనా కంపెనీతో సబ్ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నిరోజుల పాటు ఆ సంస్థ ప్రతినిధులు సర్వే చేశారు. తీరా… ఆ కంపెనీ తప్పుకోవడంతో అమెరికాకు చెందిన రాబిన్సన్తో సబ్ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఆదిలో సొరంగ నిర్మాణ పనులను వేగంగా చేసిన సదరు జేపీ కంపెనీ టీబీఎం పాతబడి సాంకేతిక సమస్యలు తలెత్తేకొద్దీ చేతులు దులుపుకోవడం ప్రారంభించింది. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేనాటికే సదరు జేపీ కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లోకి పోయింది. దీంతో ఆదిలో వేగంగా జరిగిన పనుల్లో జాప్యం జరిగింది.
టైగర్ రిజర్వు ఫారెస్టు కారణంగా శ్రీశైలం సొరంగం ఏకధాటిగా 44 కిలోమీటర్లు కనీసం ఒక ఆడిట్… చివరకు కించిత్తు షాఫ్ట్ (భూ ఉపరితలం నుంచి దిగువకు మార్గం) కూడా లేకపోవడంతో అది పెను సమస్య అనేది కాలక్రమేణా నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌తో పాటు తెలంగాణ ఇంజినీర్లకు అనుభవంలోకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లడంతో కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచినప్పటికీ నిలబడి, కుదురుగా పని చేయలేకపోయింది. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) సైతం అనేకసార్లు జేపీ-ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనులు వేగంగా జరిగేందుకు ప్రయత్నించింది. కేసీఆర్ హయాంలో 11.482 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించారు.
సాంకేతికంగా అన్ని కోణాల్లో సొరంగ పనులనేవి ప్రారంభంలో వేగంగా జరుగుతాయనేది అందరికీ తెలిసిందే. ఆపై లోపలికి పోయేకొద్దీ అన్నిరకాల సమస్యలు ముసురుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి పనులు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు పనులను ముందుకు తీసుకుపోయింది. కానీ కష్టాల లోతు తెలియని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది మొదలు కేసీఆర్ హయంలో ఎస్సెల్బీసీ నిర్లక్ష్యానికి గురైంది… తాము పరుగులు పెట్టిస్తామంటూ ప్రబల్బాలకు పోయింది. సాంకేతిక లోతులు పరిశీలించకుండా, పర్యవేక్షణ సాగించకుండా అనాలోచిత వైఖరికి నిర్మాణ సంస్థ కూడా తోడవడంతో ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చారిత్రక ఎస్సెల్బీసీ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కనీసంగా రెండు, మూడు సంవత్సరాలకుగాను ఇన్లెట్ వైపు పనులు మొదలయ్యే పరిస్థితులు లేవని ఇంజినీర్లే చెబుతున్నారు.
సాధారణంగా ఏదైనా నిర్మాణ కంపెనీ పనుల్లో జాప్యం చేస్తే ఒకట్రెండుసార్లు నీటిపారుదల శాఖ నోటీసులు ఇవ్వడమో, సహేతక కారణాలుంటే గడువు పొడిగించి ఒత్తిడి పెంచుతుంది. కానీ ఎస్సెల్బీసీ సొరంగ పనుల తీరే వేరు. నిర్మాణ కంపెనీ జేపీ పదేపదే అడ్వాన్సు బిల్లులు తీసుకోవడంతో పాటు పనుల్లో కూడా వేగం పెంచలేదు. వాస్తవానికి ఆ నిర్మాణమే సంక్లిష్టమైనదని ఆదిలోనే గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఒకటీ అరా కాదు… ఏకంగా అరు పర్యాయాలు గడువు పొడగింపునకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు రద్దు చేసి మరో సంస్థకు ఇవ్వాలంటే… జలయజ్ఞం సమయంలో ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో పెట్టిన షరతుల కారణంగా ప్రభుత్వమే అప్పనంగా కోట్లాది రూపాయల్ని తిరిగి జేపీకి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనతో హెడ్‌రెగ్యులేటర్ పనులు ఆంధ్రప్రదేశ్ భూ పరిధిలోకి వెళ్లిన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుతో ప్రభు త్వం భారీ మొత్తాన్ని భరించాల్సి వచ్చిం ది. పైగా కాంట్రాక్టు రద్దు చేస్తే టీబీఎం యంత్రాలను సదరు నిర్మాణ సంస్థ తీసుకుపోలేదు. అలాగని వాటిని వెనక్కి తీసుకువచ్చే పరిస్థితి కూడా ఉండదు. దీంతో ఆ కంపెనీతోనే ఎలాగోలా నెట్టుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది.
(గుండాల కృష్ణ)