ఖానాపురం, మే 27: ఎన్నికల్లో ఒక స్థిరమైన వ్యక్తిత్వం గెలుస్తుందే తప్ప బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తావులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యంతో తీన్మార్ మల్లన్న చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. ప్రజాసేవ కోసం అమెరికాలో ఉన్నత ఉద్యోగం మానేసి ఇండియాకు వచ్చింది జై తెలంగాణ నినాదం కోసమేనని అన్నారు. ఆనాడు తనను కాకతీయ యూనివర్సిటీ ముందుండి నడిపించిందని, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులతో రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న తన మాటలు మార్చుకోకపోతే భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు.