హైదరాబాద్: ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో జరుపుతున్న మారణహోమాన్ని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (BKMU) జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు తీవ్రంగా ఖండించారు. ఈ మారణహోమాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ నారాయణ పూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో సాయుధ పోలీస్ ధళాలు ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో సహా 27 మందిని కాల్చి చంపడం దుర్మార్గంగా ఉందన్నారు. కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతున్న రోజుల్లో విప్లవ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడై అజ్ఞాతం లోకివెళ్లారని, సుదీర్ఘకాలం పాటు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశాడన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించినా, అనేక రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు కేంద్రప్రభుత్వానికి ఆపరేషన్ కగార్ ఆపి, శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసినప్పటికీ.. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే ఉందని విమర్శించారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతమొందిస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించడం నిరంకుశ ఫాసిస్ట్ విధానాన్ని తెలియచేస్తుందన్నారు. శాంతి చర్చలకు సిద్ధమన్న మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం నరమేదానికి పూనుకోవడం దారుణంగా ఉందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ నిలిపి వేసి సాయుధ మిలిటరీ దళాలను వెనక్కి పంపించాలన్నారు. ఏ సమస్యకైనా పరిష్కారమార్గం చర్చలేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. నారాయణపూర్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు.