ముషీరాబాద్, నవంబర్ 21: అధికారంలోకి వచ్చి పదేండ్లయినా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిన బీజేపీని మంద కృష్ణమాదిగ ఎలా నమ్ముతారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రశ్నించారు. ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటున్న బీజేపీ మాటలు కూడా మోసమేనని పేర్కొన్నారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో బీసీ నేతలు రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు గానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత బండి సంజయ్‌ని మార్చి కిషన్‌రెడ్డిని నియమించినప్పుడు గానీ మంద కృష్ణకు బీసీ నినాదం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం, వర్గీకరణ అంశాన్ని పక్కకు నెట్టివేయడం మంద కృష్ణకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌తో కొన్నిరోజులు, చంద్రబాబుతో మరికొన్ని రోజులు, కిషన్‌రెడ్డి కనుసన్నల్లో కొద్దిరోజులు మంద కృష్ణ వర్గీకరణ ఉద్యమాన్ని నడుపుతూ వస్తున్నారని విమర్శించారు. నిజంగా వర్గీకరణ సాధించాలనే ఉద్దేశం ఉంటే వర్గీకరణకు అనుకూలంగా పార్టీలకు అండగా నిలవాలని హితవు ఫలికారు. గతంలో మాదిగలను మోసం చేసింది బీజేపీ.. ప్రధాని మోదీ నరహంతకుడు అన్న మంద కృష్ణ మళ్లీ అదే పార్టీ పంచన చేరడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.