హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆర్థిక నేరగాళ్లను అదుపు చేసి దేశ సంపద కాపాడేందుకు ఉద్దేశించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రతిపక్ష పార్టీలను వేధించే సంస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తన ప్రత్యర్థును వేధించేందుకే ఈడీని పూర్తిగా వినియోగించుకొంటున్నదనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈడీ చర్యలు కూడా అందుకు అనుగుణంగానే సాగుతున్నాయి. సాధారణంగా ఈడీ ఏదైనా కేసు దర్యాప్తు మొదలుపెడితే.. దానితో సంబంధం ఉన్నవాళ్ల ఇండ్లు, కార్యాలయాపై సోదాలు నిర్వహిస్తుంది. ఆ సందర్భంలో కొందరు నిందితుల పేర్లను అధికారికంగా వెల్లడిస్తుంది. కొందరి పేర్లను మాత్రం లీకుల రూపంలో మీడియాకు చేరవేస్తున్నది. వీరంతా కచ్చితంగా బీజేపీ రాజకీయ ప్రత్యర్థులే ఉంటున్నారు. ఈ లీకుల ఆధారంగా బీజేపీకి మద్దతుగా ఉండే కొన్ని మీడియా సంస్థలు చిలువలు పలువలు చేసి లేనిది ఉన్నట్టు కథనాలు అల్లి గంటలకు గంటలు..రోజుల తరబడి ప్రజల మెదళ్లలోకి బలవంతంగా ఎక్కించేందుకు తంటాలు పడుతున్నాయి. ఇక బీజేపీ సోషల్మీడియాకైతే అడ్డూ అదుపూ ఉండదు. ఇలా ఉద్దేశపూర్వకంగా కొనసాగే తప్పుడు ప్రచారాన్ని ఈడీ ఖండించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. అదేమిటంటే తాము ఆ పేర్లు చెప్పలేదు కదా? ఎందుకు ఖండిస్తాం? అని బుకాయిస్తుంది. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు.. బీజేపీతో ఈడీ కుమ్మక్కు అయ్యిందని.
దృష్టి మళ్లించేందుకే..
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం అని ఈడీ హైదరాబాద్‌తోపాటు అనేకచోట్ల హడావిడి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండేవారి ఇండ్లల్లో సోదాలు అంటూ ముందే కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి ప్రచారం చేస్తున్నది. దీని వెనుక అసలు కారణం వేరే ఉన్నదని రాజకీయ పండితులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కొత్త సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని గట్టిగా డిమాండ్ చేశారు. కేసీఆర్ డిమాండ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో బీజేపీ కక్కలేక మింగలేక అన్నట్టు ఇరుకున పడింది. దీని నుంచి దేశం దృష్టి మళ్లించేందుకే ఈడీని రంగంలోకి దించినట్టు అనుమానిస్తున్నారు. అదిగో సోదాలు.. ఇదిగో సోదాలు అంటూ లీకులు ఇచ్చి.. బీజేపీ సోషల్‌మీడియాకు మంచి సరుకు అందించి కేసీఆర్ డిమాండ్‌ను మరుగుపర్చే కుట్ర జరుగుతున్నదని అంటున్నారు. శుక్రవారం నాటి ఈడీ సోదాలపై ఢిల్లీ నుంచి కొందరు ఉద్దేశపూర్వకంగానే తెలుగు మీడియాకు లీకులు ఇచ్చినట్టు సమాచారం. బీజేపీకి కొమ్ముకాసే మీడియా.. ఈడీ లీకులకు మరికొన్ని పేర్లు కలిపి ఇష్టమొచ్చినట్టు విష ప్రచారానికి దిగాయి. దేశంలోని ఎన్నో చోట్ల సోదాలు జరుగుతున్నా.. తెలుగు రాష్ర్టాలకే ఈ కేసును ఆపాదిస్తూ హడావుడి చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.