(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): ‘ఉచితాల పేరుతో పన్నుల సొమ్మును పంచిపెట్టడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడుతున్నారు. పన్ను సొమ్మును సరైన విధానంలో ఖర్చుపెడితేనే వారు సంతోషంగా ఉంటారు’ అంటూ గత ఏడాది అక్టోబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉచిత హామీలను’ తీవ్రంగా తప్పుపట్టారు. అయితే, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నందున గెలుపు కోసం బీజేపీ అవే ‘ఉచిత హామీలను’ నమ్ముకున్నది. కర్ణాటక ఎన్నికల్లో ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని, ఉచితంగా పాలు పోస్తామని రకరకాల ఉచితాలు ప్రకటించినట్టుగా మధ్యప్రదేశ్‌లోనూ ఉచిత హామీలు ఇవ్వడం ప్రారంభించింది. బీజేపీకి కాంగ్రెస్ కూడా పోటీ పడి మరీ హామీలు ఇస్తున్నది. ఇంకా ఎన్నికలకు ఐదు నెలల సమయం ఉండగా ఇప్పటి నుంచే రెండు పార్టీలూ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. మేనిఫెస్టోలను ప్రకటించకముందే పెద్ద ఎత్తున హామీలను ఇస్తున్నాయి.