చండూరు : టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటును చూసి బీజేపీ ఉలిక్కిపడుతుందని టీఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి , ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. చండూరులో ఆదివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్సీ సారయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మోడల్ దేశం యావత్తు కావాలని డిమాండ్లు వస్తుంటే బీజేపీ నాయకులకు నిద్రపట్టడం లేదని ఆరోపించారు.
కేసీఆర్ పాలనను అంతం చేసేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలు చూస్తుంటే బీజేపీ వ్యవహారం జుగుప్సకరంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు తప్పు అని తెలుసుకోకుండా బండి సంజయ్ యాదాద్రిపోయి నానా హంగామా చేసి అభాసు పాలయ్యాడని ఆరోపించారు.బీజేపీ భాగోతంపై వీడియోలు, ఆడియోలు బయటికి వస్తున్నాయని, వీటికి సంబంధించిన ఆధారాలు పక్కాగా ఉన్నాయని వెల్లడించారు.
అభివృద్ధిలో పోటిపడకుండా దొంగచాటుగా దెబ్బతీయాలని కుట్ర పన్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ మునుగోడు లో టీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు. సీఎం సభ ట్రెండ్ సెట్టర్ అవుతుందని, సభకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని వివరించారు.
సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి ..
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూర్ మండలం బంగారి గడ్డ వద్ద సభ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని వారు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. పార్కింగ్ కోసం మండలాల వారీగా వేరు వేరుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.