హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): జలసౌధలో ఏప్రిల్ 18న బిడ్డర్లు, రైస్ మిల్లర్ల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.100 స్టాంప్‌పేపర్ మీద బిడ్డర్లు, రైస్‌మిల్లర్లకు మధ్య ఎంవోయూ రాయించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రూ.2,007 విలువ చేసే బియ్యాన్ని మిల్లర్లే తిరిగి రూ.2,223కు బిడ్డర్ల నుంచి కొనుగోలు చేసేలా సంతకాలు తీసుకున్నది నిజం కాదా? అని నిలదీశారు. రూ.216 అధికంగా రాయించటం వల్ల రూ.800 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారని, ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 1.50 లక్షల టన్నుల సన్నవడ్లను క్వింటాలుకు రూ.2,259కు బిడ్డర్లకు అమ్మి, ఓపెన్ మార్కెట్లో రూ.5,700కు క్వింటా బియ్యాన్ని ఎందుకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్లను ప్రభుత్వమే మిల్లింగ్ చేసుకొని ఉంటే క్విటాలుకు రూ.3,500 లోపే పడేదని తెలిపారు. గతంలో తాను ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్.. ఇప్పుడు యూ ట్యాక్స్‌పై ప్రశ్నించగానే ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. బకాయిలు ఉన్న రైస్మిలర్లపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలని, డిఫాల్టర్ల పేర్లను బయటపెట్టాలని అన్నారు. తరుగు తీయటం లేదంటున్న మంత్రి.. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారా? అని నిలదీశారు. ఒప్పందంలో అవినీతిపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.