డిచ్పల్లి, నవంబర్ 19: ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో డిచ్పల్లి పోలీసులు కేసు నమో దు చేశారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం అమృతాపూర్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారం చేస్తుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తమపై దాడికి యత్నించారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాళ్ల సురేశ్, విజయ్, రమణ, బాలయ్యతోపాటు మరో ఆరుగురు తమపై దాడికి యత్నించగా.. తన చేతివేలికి గాయమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్ అమృతాపూర్కు వెళ్లి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన సురేశ్, రమణ, బాలయ్య, విజయ్, శ్రీధర్, అర్వింద్తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.