మక్తల్, జూన్ 14 : అవినీతికి పాల్పడ్డ ఎస్సైకి తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇప్పిస్తుండడంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు బెదిరింపులకు దిగడం, ఎస్సై కూడా లాకప్‌డెత్ చేస్తానని భయపెట్టడంతో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నట్టు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం నర్వ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం స్థల పరిశీలనకు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వెళ్లిన సమయంలో పక్కనే పొలంలో ఉన్న స్థానిక బీజేపీ కార్యకర్త మున్నూరు శేఖర్‌రెడ్డి (39) ఎమ్మెల్యేతో మాట్లాడారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసి వెళ్లిన విక్రమ్‌కు అవినీతి అధికారిగా పేరుందని, మళ్లీ అతడిని ఇక్కడికి తీసుకురావొద్దని చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే, అతడి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నర్వ మండలాధ్యక్షుడు చెన్నయ్య సాగర్ కలిసి శేఖర్‌రెడ్డిని దూషించారు. ‘మా ప్రభుత్వం ఉంది.. మా ఇష్టమొచ్చినట్టు చేస్తం.. అడగడానికి నువ్వెవరు’ అని బెదిరించారు. శేఖర్‌రెడ్డి సంగతి చూడాలని అక్కడే ఉన్న ఎస్సై కురుమయ్యకు ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. తర్వాత చెన్నయ్య పీఎస్‌కు వెళ్లి శేఖర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశాడు.
అనంతరం స్టేషన్‌కు రావాలని శేఖర్‌రెడ్డికి ఎస్సై ఫోన్ చేశాడు. రాకుంటే తీసుకొచ్చి లాకప్‌డెత్ చేస్తానని భయపెట్టాడు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, ఎస్సై బెదిరింపులతో మనస్తాపం చెందిన శేఖర్‌రెడ్డి గురువారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగినట్టు కుటుంబసభ్యులు వివరించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శేఖర్‌రెడ్డిని పాలమూరు ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. స్థానిక ఎమ్మెల్యే అరాచకాలకు పాల్పడుతున్నారని బీజేపీ మండల నాయకులు ఆరోపించారు. శేఖర్‌రెడ్డి మృతికి కారణమైన ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్సై కురుమయ్యను వివరణ కోరగా శేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసింది వాస్తవమేనని చెప్పారు. అయితే శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మధ్య వివాదం తలెత్తిందని, వారి ఫిర్యాదు మేరకు శేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు రావాలని ఫోన్‌చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.