కమలాపూర్, ఆగస్టు 7: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వృద్ధులకు రూ.2 వేల పింఛన్ ఇచ్చి ఆసరాగా నిలువడమేగాక వారి ఆత్మగౌరవం నిలబెట్టారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో రూ.500, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో రూ.600 పింఛన్ ఇస్తున్నట్టు గుర్తుచేశారు. కరోనా వచ్చినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఈ నెల 15 నుంచి 57 ఏళ్లు నిండిన వారికి కూడా 2 వేల పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. రైతులకు నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు 3 లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తున్న గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. కమలాపూర్ నియోజకవర్గానికి 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైతే.. ఏడేండ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని ఆరోపించారు. అదే పాలకుర్తిలో 5 వేల ఇండ్లు కట్టించి పేదలకు ఇచ్చానని, పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి వెయ్యి ఇండ్లకు 760 ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారన్నారు.
బండి సంజయ్ ఏమైనా పనిచేసిండా?
ఏడేండ్లలో మహిళలకు సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు ఇచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలు బాగుంటాయని చెప్పారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, కలెక్టర్ ఆర్జీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.