హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు చేస్తున్నవి విజయ సంకల్ప యాత్రలు కావని, అవి విసుగు సంకల్ప యాత్రలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో యాత్ర పేరిట తిరుగుతున్నారని, కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ర్టానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ యాత్రలకు ప్రజాదరణ లేదని, బీఆర్ఎస్పై విమర్శలకే అవి పరిమితమయ్యాయని విమర్శించారు. పదేపదే బీఆర్ఎస్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆరేడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందని గుర్తుచేశారు.
కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి తెలంగాణకు, ఆయన పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. ఐటీఐఆర్ రద్దయితే ఎందుకు అడగలేదని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే నిధులు ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. పొద్దున లేస్తే బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం తప్ప మరో పని లేకుండా పోయిందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందడుగు వేస్తే, నమామి గంగ తరహాలో నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం వల్లే ఒక్క సీటు మినహా అన్నింటిలోనూ గెలిచామని పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు.