
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రంలోని బీజేపీనేతలు పార్లమెంట్‌లోనే కీర్తిస్తుంటే.. రాష్ట్ర నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజావంచన యాత్రలు నిర్వహిస్తున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో గాలిమాటలు చెప్తున్నారని దుయ్యబట్టారు. తాలిబన్లు హైదరాబాద్‌కొస్తే ఆ తప్పు ముమ్మాటికీ కేంద్రానిదేనని.. సరిహద్దుల్లో వారి ని అరికట్టలేని చేతగాని కేంద్రం ఎందుకుండాలె అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీకి పాలన చేతకాకపోతే తమకు అప్పగించాలని డిమాండ్‌చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి మంత్రి మీడియా తో మాట్లాడుతూ.. పెట్రో ధరలు పెంచామని గొప్పగా చెప్పుకోవడానికే కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాదయాత్ర చేపట్టారా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏంచేసిందని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు రూ.400 గ్యాస్ ధరను వెయ్యికి పెంచబోతున్నామని, జన్ధన్ఖాతాల్లో 15 లక్షలు వేయకుండా స్వచ్ఛభారత్ పేరిట చీపుర్లు చేతికిచ్చామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయామని చెప్తూ ప్రజల ఆశీర్వాదం పొందితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కిషన్‌రెడ్డికి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు వంటి పథకం ఏదైనా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని నిలదీశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్రం నిధులివ్వాలని నీతిఆయోగ్ చెప్పినా ఐదు రూపాయలైనా ఇవ్వని నిజస్వరూపాన్ని ప్రజలకు వివరించుకోవాలని చురక అంటించారు. తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకు మించి అదనంగా ఒక్కపైసా ఇవ్వకపోగా.. సీఎం కేసీఆర్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలుచేయడంపై మంత్రి మండిపడ్డారు. కేసీఆర్‌ను మించి ఏ రాష్ట్రంలో, ఏ సీఎం అభివృద్ధి చేస్తున్నారో చెప్పాలని డిమాం డ్‌చేశారు. అబద్ధాలు చెప్పి సీఎం కేసీఆర్‌పై ప్రజలకున్న ప్రేమను కొల్లగొట్టలేరని పేర్కొన్నారు.
పార్లమెంట్లో కీర్తించి.. ఇక్కడ అబద్ధ్దాలా?
అభివృద్ధి, సంక్షేమరంగాల్లో తెలంగాణ ఆదర్శవంతమైన పాలనతో దూసుకుపోతున్నదని పార్లమెంట్లో దాదాపు అన్నిశాఖల మంత్రులు ఒకవైపు కీర్తిస్తుంటే.. కిషన్‌రెడ్డి లాంటి నాయకులు ప్రజల వద్ద అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరుపాళ్లు అమలుచేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని.. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాల మేరకు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టామని గుర్తుచేశారు. ప్రజలు ఏది చెపుతారో సీఎం కేసీఆర్ దానిని చేసి చూపిస్తారని అన్నారు. 2014, 2018 ఎన్నికల సందర్భం గా ఇచ్చిన ఏ హామీనీ బీజేపీ నిలబెట్టుకున్నదో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఒకే అబద్ధాన్ని వం దసార్లు చెప్పి నమ్మించేందుకు ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలేం అమాయకులు కాదని.. బీజేపీ నేతలు నిజాలు మాట్లాడాలని హితవుపలికారు.
రివర్స్షాక్ ఎంతోదూరంలోలేదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 130 కోట్ల మంది ప్రజలకు షాక్‌లమీద షాక్‌లు ఇస్తున్నదని.. వారు బీజేపీకి రివర్స్ షాక్ ఇచ్చేరోజు ఎంతో దూరంలో లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. రైతుల జేబులు కొట్టే చట్టాలు తెచ్చిన ఘనత బీజేపీదేనని చెప్పారు. తెలంగాణలో 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు అందిస్తుంటే దానిని ఎత్తగొట్టేందుకు కొత్త చట్టాలు తెచ్చిందని మండిపడ్డారు. దేశ ప్రజలపై ఆర్థిక దాడులే తప్ప మరో సరిహద్దు దాడులులేవని మండిపడ్డారు.