నల్లగొండ రూరల్, జూన్ 14 : వంద మంది అమిత్‌షాలు వచ్చినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేపడతామన్న బీజేపీ.. ఇప్పటికీ దాని ఊసెత్తక పోవడం దారుణమన్నారు. అంతటితో ఆగకుండా మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నదని విమర్శించారు. అసలు బీజేపీ అంటేనే మతతత్వాన్ని, కులతత్వాన్ని ప్రోత్సహించే పార్టీ అని ఆయన పేర్కొన్నారు.
అలాంటి బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని అమిత్‌షా కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు మాదిగలకు 13 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలని కోరారు. పలు డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఈ నెల 30న హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మాదిగలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభ ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు కత్తుల తులసీదాస్ పాల్గొన్నారు.