హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఈ నెల 19న రాష్ట్రానికి వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో సన్మాన సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాదికారులు, మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది.
అనంతరం కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర మంత్రులు బేగంపేట విమానాశ్రయానికి చేరిన తర్వాత రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర కార్యాలయం వద్ద సన్మానం చేస్తామన్నారు. అనంతరం కేంద్రమంత్రులు పాత నగరంలోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 35 శాతానికిపైగా బీజేపీకి ఓట్లు వేశారని, ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రంలో భారీ కృతజ్ఞత సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంచార్జీలను నియమించింది. జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేసింది. హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ కుమార్ దేవ్, మహారాష్ట్రకు భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్, జార్ఖండ్‌కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వశర్మను ఇంచార్జీలుగా నియమించింది.