Bandi Sanjay | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు తమ అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకొన్నారు. ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి. బండి సంజయ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉదయం చేసిన పోస్ట్‌లో తీవ్ర అక్షర దోషాలు ఉన్నాయి. ఆత్మాభిమానపు ‘స్వాలంబన’, సమత కోసం ‘గుళమెత్తిన’ చైతన్య గీతిక అని, భారత ‘రాజ్యాంగు’ రచనా జయకేతనం అంటూ అడ్డదిడ్డంగా రాసేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
‘బంటీ నీ సబ్సు స్లో నా ఏంటి?. స్వాలంబన కాదు స్వావలంబన, గుళమెత్తిన కాదు గళమెత్తిన, రాజ్యాంగు కాదు రాజ్యాంగం’ అంటూ ఓ నెటిజన్ తప్పులు ఎత్తిచూపారు. ‘పేపర్ లీక్ వ్యవహారంలో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడవైన నువ్వు.. ఇట్ల చేస్తే ఎట్లనే’ అని మరో నెటిజన్ చురక అంటించారు. ‘వీళ్లను తట్టుకోవడం మన వల్ల కాదు.. దేవుడా’ అంటూ మరో నెటిజన్ నిట్టూర్చారు. బండి సంజయ్ పోస్ట్ పెట్టడమే ఆలస్యం రాష్ట్రంలోని పలువురు బీజేపీ నేతలు అందులో ఉన్న తప్పులను పట్టించుకోకుండా షేర్ చేసేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను గమనించి, నాలుక కరుచుకున్న బండి సంజయ్.. దాదాపు గంట తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి, అక్షర దోషాలు సవరించి, కొత్త పోస్ట్ పెట్టాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.