హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించి ఆయనకు షాక్ ఇచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. రాజీనామా లేఖలో రాజాసింగ్ పేర్కొన్న అంశాలు పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే రాజీనామాను ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు.
పదవి కోసం రాజీనామా చేయలేదు: రాజాసింగ్
తన రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ స్పందిస్తూ.. పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదని తెలిపారు. 11 ఏండ్ల క్రితం తాను బీజేపీలో చేరానని, ప్రజలకు సేవ చేసేందుకు, హిందుత్వాన్ని రక్షించేందుకు పార్టీలో చేరినట్టు స్పష్టంచేశారు. బీజేపీ తనను నమ్మి మూడుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, తనపై నమ్మకం ఉంచిన పార్టీ నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.