బడంగ్‌పేట, ఆగస్టు 4 : మహేశ్వరాన్ని ఫోర్త్ సిటీగా మారుస్తామని ప్రకటించడం వెనుక కాంగ్రెస్ భూదందా కుట్రలు దాగి ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వేల ఎకరాలను సేకరించి దోచుకునేందుకు ఓ కాంగ్రెస్ నాయకుడికి బాద్యతలు అప్పగించారని, ఇప్పటికే ఆ నాయకుడు వెయ్యి ఎకరాల భూమిని తీసుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని గుర్రంగూడలో ఆదివారం బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహేశ్వరంలో కాంగ్రెస్ నాయకులు భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వేలకోట్లు కొల్లగొడుతున్నారని చెప్పారు. ఆస్తులు కూడబెట్టేందుకు కాంగ్రెస్ ఇది మంచి అవకాశంగా తీసుకుంటున్నదని, 2 లక్షల కోట్ల స్కాం జరగబోతున్నదని, ‘భూమాత’తో భూమిని కాజేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు.
‘స్థానికం’ కోసమే రుణమాఫీ డ్రామా
గత ప్రభుత్వం 36లక్షల మందికి రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 18లక్షల మందికే చేయడం సిగ్గుచేటని, 70 శాతం మందికి రుణమాఫీ కాలేదని బండి విమర్శించారు. స్థానిక ఎన్నికల కోసమే కాంగ్రెస్ రుణమాఫీ డ్రామా అని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేద్దాం
బీజేపీ, కాంగ్రెస్ తిట్టుకోవడం మానేసి కలిసి పనిచేద్దామని బండి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీని, మోదీని విమర్శించడం మానుకోవాలని, కేంద్ర సహకారం కావాలంటే విమర్శలు వద్దని సూచించారు. తాను కూడా కాంగ్రెస్‌ను విమర్శించనన్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, శ్రీరాములు, లక్ష్మారెడ్డి, శంకర్ పాల్గొన్నారు.