సిద్దిపేట అర్బన్/ విద్యానగర్, ఫిబ్రవరి 15 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయిలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్‌లోని శుభమంగళ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్రస్టేషన్లో అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఓ బోగస్ ప్రక్రియ అని విమర్శించారు. హిందూ ముస్లిం, బీసీ ముస్లిం అని ప్రపంచంలో ఎకడైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే ముందు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్స్ కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కులాల మధ్య తగాదాలు పెట్టడానికి, రాహుల్‌గాంధీ మెప్పు పొందడానికి మోదీ కులాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెరపైకి తెస్తున్నారని అధ్యక్షుడు విమర్శించారు. సిద్దిపేట హరిత హోటల్లో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీకి పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చి ఓట్ల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.