హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ ఇదీ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ వల్లెవేస్తున్న మంత్రం. కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇది కేవలం నినాదానికే పరిమితమైంది. వాస్తవంలో తెలంగాణపై బీజేపీ సర్కార్ వివక్ష ప్రదర్శిస్తున్నది. ముఖ్యంగా పారిశ్రామిక పరంగా రాష్ర్టానికి తీవ్రఅన్యాయం చేస్తున్నది. అధికారంలోకి రాగానే ఐటీఐఆర్ రద్దుతో తొలి వెన్నుపోటు పొడవగా, కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న కక్షతో పదేండ్లపాటు తెలంగాణ విజ్ఞప్తులన్నీ పక్కన పడేసింది. తాజాగా హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్రం పట్టించుకోలేదు. కానీ లక్నో మెట్రో రైల్‌కు రూ.5,801 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్రమంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సెమీ కండక్టర్ల పరిశ్రమల కేటాయింపులోనూ తెలంగాణకు అన్యాయం చేసింది. ఏపీ, ఒడిశా, పంజాబ్ రాష్ర్టాలకు నాలుగు పరిశ్రమలను కేటాయించింది. ప్రతీదశలోనూ, ప్రతీ ప్రాజెక్టుల కేటాయింపులోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. కానీ తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా, 8మంది కాంగ్రెస్ ఎంపీలున్నా.. తెలంగాణ రాష్ర్టానికి సాధించింది మాత్రం సున్నా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ రాష్ట్రంపై మరోసారి వివక్ష చూపించింది. ఉత్తరాది రాష్ర్టాలకు, బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న మోదీ ప్రభుత్వం.. కేంద్ర ఖజానాలో భారీగా భాగస్వామ్యం కలిగిన తెలంగాణకు మాత్రం నిధుల విడుదలలో మొండిచేయి చూపుతున్నది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించలేదు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు పైసా కూడా కేటాయించలేదు. లక్నో మెట్రో విస్తరణకు మాత్రం రూ.5,801 కోట్లు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌కు రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా యూపీఏ ప్రభుత్వం 2013లో ఐటీఐఆర్‌ను మంజూరు చేసింది. సైబరాబాద్, శంషాబాద్, ఉప్పల్, పోచారం పరిధిలోని 201.99 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 49,912 ఎకరాల్లో ప్రాజెక్ట్ నెలకొల్పాలని నిర్ణయించింది. రెండు దశల్లో పూర్తి చేయాలని భావించింది. ప్రత్యక్షంగా 14.8 లక్షల మందికి, పరోక్షంగా 55.90 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపింది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ ఐటీఐఆర్‌ను రద్దు చేసింది. పునరుద్ధరించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టు కోసం రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ రక్షణ రంగంలో తెలంగాణ రాష్ర్టానికి కీలకపాత్ర. రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన పరిశోధనలు, ఉత్పత్తుల్లో తెలంగాణ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. దేశానికే తలమానికంగా నిలిచిన డీఆర్డీవో, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), డీఈఆర్‌ఎల్, డీఎంఆర్ఎల్, బీడీఎల్ ఇలా ఎన్నో కంపెనీలకు తెలంగాణ నిలయంగా ఉన్నది. రక్షణ రంగంలో వందలాది ఎంఎస్ఎంఈలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో రక్షణ కారిడార్ ఏర్పాటు చేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రులు ఢిల్లీకి వెళ్లి చాలాసార్లు విజ్ఞప్తులు ఇచ్చినా కేంద్రం దృష్టిపెట్టలేదు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణకు ఉన్న అనుకూలతలను వివరించినా పెడచెవిన పెట్టారు. చివరికి మోదీ ప్రభుత్వం తాజాగా బీజేపీ పాలిత యూపీలోని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్ కారిడార్‌ను మంజూరు చేసింది. రూ.20వేల కోట్లతో 3వేల ఎకరాల్లో కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తున్నది. ఇదే కారిడార్‌ను తెలంగాణకు మంజూరు చేస్తే ఇక్కడి ఎకోసిస్టమ్ ఆధారంగా అంతకన్నా రెట్టింపు సంఖ్యలో ఫలితం కనిపించేదని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని బీజేపీ ఎంపీల్లో ఒక్కరు కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన దాఖలాలు లేవని పారిశ్రామిక నిపుణులు మండిపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాసిటినీ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ భారీ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు కోరింది. అయినా మోదీ సర్కారు పట్టనట్టు వ్యవహరించింది. ఏ ఒక్క బీజేపీ ఎంపీగానీ, ఎమ్మెల్యేగానీ, నాయకుడుగానీ మోదీపై ఒత్తిడి తీసుకురాలేదు. చివరికి సొంతంగా తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నం చేసింది. 19వేల ఎకరాలు అవసరం కాగా 14వేల ఎకరాల్లో భూసేకరణ పూర్తి చేసింది. పరిశ్రమలకు భూముల కేటాయింపు మాత్రమే మిగిలి ఉన్న దశలో.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్మాసిటీని మూలకు పడేసింది. రద్దు చేస్తున్నామని ఒకసారి, కొనసాగిస్తామని మరోసారి, ఫ్యూచర్ సిటీ అంటూ ఇంకోసారి ప్రకటిస్తూ నాటకాలు ఆడుతున్నదని రాజకీయవర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ముందే సహకరించి ఉంటే ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటు జరిగేది. రాష్ర్టానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగేవి.
రాష్ర్టానికి టెక్స్టైల్ పార్క్‌ను మంజూరు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం పదులసార్లు కేంద్రాన్ని కోరింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే అతి పెద్ద పార్క్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడలేదు. చివరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మార్చిలో టెక్స్టైల్ పార్క్‌ను మంజూరు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చూడకుండా ముందే మంజూరు చేసి ఉంటే.. పారిశ్రామికంగా తెలంగాణకు ఎంతో మేలుకలిగేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చేనేతను ప్రోత్సహించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పదులసార్లు విజ్ఞప్తి చేసింది. అయినా కేంద్రం పెడచెవిన పెట్టింది. బీజేపీ ఎంపీలు కూడా పట్టించుకోలేదు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుడు మార్చిలో
మంజూరు చేసింది.
హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి పదుల సార్లు విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా జహీరాబాద్‌లో పారిశ్రామిక క్లస్టర్ అభివృద్ధి చేయాలని కోరింది. కానీ బీజేపీ ఎన్నడూ పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా జహీరాబాద్‌లో నిమ్జ్ ఏర్పాటు చేసింది. పరిశ్రమలను ఆహ్వానించింది. ఈ కారిడార్‌పై పదేండ్లపాటు నాన్చిన మోదీ ప్రభుత్వం చివరికి నిరుడు మంజూరు చేసింది. ఇవి ఉదాహరణలు మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వంపై కక్షతో తెలంగాణపై మోదీ ప్రభుత్వం విషం కక్కిందని, ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమల ఏర్పాటును అడ్డుకున్నదని పారిశ్రామిక నిపుణులు మండిపడుతున్నారు.
యూపీఏ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్డీసీ) మంజూరైంది. నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్డీసీని ఏపీకి తరలించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు కూడా ఎన్డీసీని మంజూరు చేయాలని 11 ఏండ్లుగా కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వస్త్ర పరిశ్రమకు సంబంధించి… రాష్ట్రంలో ఉన్న వనరులు, ఎన్డీసీ ఏర్పాటు ఆవశ్యకతను కేసీఆర్ ప్రభుత్వం చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి వివరించింది.