హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ధన ప్రవాహానికి తెరలేపిందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. అందులో భాగంగానే బీహార్‌లో 96లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున పంపిణీ చేసిందని విమర్శించారు.
బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో రాష్ట్ర సహాయ కార్యదర్శులు తకెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహాలతో కలిసి వారు మీడియాతో మాట్లాడుతూ.. అధికార కేంద్రీకృతానికి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ విధానాలను వామపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 26న ఖమ్మం లో సీపీఐ 100 ఏండ్ల ఉత్సవాల ముగిం పు సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 5న ఖమ్మంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేయనున్నామని, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కార్యదర్శులు పాల్గొనున్నారని పేర్కొన్నారు.