Bandi Sanjay | రామచంద్రాపురం, నవంబర్ 16: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో బీజేపీ సభ అట్టర్‌ఫ్లాప్ అయింది. సభకు ప్రజలు రాకపోవడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. శ్రీనివాస్నగర్కాలనీలోని సండే మార్కెట్లో గురువారం పటాన్చెరు బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జనం కూర్చోడానికి కుర్చీలు వేస్తే అందులో సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. కనీసం టెంటు, తాగునీటి వసతి కూడా లేకపోవడంతో వచ్చిన కొద్ది మందితోపాటు బీజేపీ శ్రేణులు కూడా ఎర్రటి ఎండలో కూర్చోలేక పోయారు. ఉదయం 11 గంటలకు సభ ఉంటుందని ప్రచారం చేశారు. కానీ, బండి సంజయ్ మధ్యాహ్నం 1.45 గంటలకు సభావేదికకు రావడంతో రెండున్నర గంటలపాటు జనం ఎండలో కూర్చోలేక పోయారు. బీజేపీ ఏర్పాట్లపై కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలో ఉండలేక చెట్ల కిందకు, నీడపట్టుకు వెళ్లారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సభకు జనం లేకపోవడంతోపాటు నామ్‌కే వాస్తే వచ్చిన వారందరూ నివ్వెరపోయారు. బండి సంజయ్ స్పీచ్‌లో పస లేకపోవడంతో ఉసూరుమంటూ అక్కడి నుంచి జారుకొన్నారు.