హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : చేవేళ్ల రోడ్డు ప్రమాదంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వింత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రోడ్లు కరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావని, బండ్లు మెల్లగా వెళ్తాయని.. రోడ్లు బాగుంటేనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయని విచిత్ర వాదన తెరపైకి తీసుకొచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రమాదానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని హైదరాబాద్-బీజాపూర్ కొత్త రోడ్డు కోసం మరోసారి భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ కొండా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్లపై అయ్యే సగం యాక్సిడెంట్లకు గుంతలే కారణమని, వాటిని తప్పించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.