హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెలా రూ.25 వేల చొప్పున భృతి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. భృతితోపాటు అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని, 250 గజాల స్థలం ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడు తరాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. 1969లో ఇందిరాగాంధీ, బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాలు 369 మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదని, పోరాటం, రక్తతర్పణ, ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్నామని చెప్పారు.