Bandi Sanjay | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బీజేపీలో ముసలం వెనుక కేంద్ర మంత్రి పదవికి సంబంధించిన పేచీ ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు మరో మంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఇదే సమయంలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడలు, నియంతృత్వ విధానాలు, అవినీతి వ్యవహారాలు, గ్రూపులు కట్టడం తదితర అంశాలపై అధిష్ఠానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్టు సమాచారం. కీలక నేతలు సైతం వ్యక్తిగతంగా కలిసినప్పుడు అధిష్ఠానం పెద్దలకు ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తున్నది. దీంతో బండి సంజయ్‌కి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారని, అధ్యక్ష పదవి వేరొకరికి అప్పగిస్తారని ఒక దశలో ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కిషన్‌రెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ సైతం నడిపించినట్టు సమాచారం. ఢిల్లీ పెద్దలు ఈటల వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. బండి సంజయ్ పదవీ కాలం పొడిగిస్తున్నామని, అసెంబ్లీ ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే సాగుతాయని ప్రకటన వెలువడింది. దీంతో అంతా సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య విబేధాలు పెరిగినట్టు ప్రచారం జరిగింది. కానీ.. దీని వెనుక అసలు మతలబు వేరే ఉన్నదని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పదవిని అర్వింద్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్న అధిష్ఠానం బండి సంజ య్ అభిప్రాయాన్ని కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ ప్రతిపాదనను బండి తిరస్కరించారని, ఇస్తే సోయం బాపురావుకు ఇవ్వాలని లేదంటే రాష్ర్టానికి పదవే వద్దని చెప్పినట్టు పార్టీలో చర్చ నడుస్తున్నది. దీంతో తన పదవికి బండి సంజయ్ అడ్డం పడ్డాడని ధర్మపురి అర్వింద్ కోపం పెంచుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. అందుకే కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తున్నది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న అర్వింద్ ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను అవకాశంగా మలచుకున్నట్టు భావిస్తున్నారు. ‘రాష్ట్ర అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదు, కేవలం కో ఆర్డినేషన్ సెంటర్’ అని వ్యాఖ్యానించడం ద్వారా బండి ఒంటెత్తు పోకడలను అర్వింద్ ఎత్తి చూపారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. ‘బండి సంజయ్ వ్యాఖ్యలను నేను సమర్థించను. ఆయన సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే’ అని ఆయన స్పష్టం చేయడంతో బండి అసమ్మతి వర్గానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు. తాజా పరిణామాలపై బండి సంజయ్ నేరుగా ఢిల్లీలోనే తేల్చుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన అర్వింద్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.