బాయిల్డ్ రైస్ కొనుగోలుపై మళ్లీ పాత పాటే
తెలంగాణ రాష్ట్రం వెయ్యి కోట్లు భరించాలంటూ కొత్త రాగం
నేరుగా వడ్లు కొనుక్కోవాలంటున్న రైతులు
హైదరాబాద్, ఏప్రిల్ 3 : ‘కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక అడుగు ముందుకేసి కాకి లెక్క ఒకటి చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండే ధాన్యాన్ని మొత్తం మిల్లర్లే కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకొంటారని, బియ్యాన్ని సముద్రం సరిహద్దు వరకు తీసుకొని వెళ్లేందుకు మిల్లర్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.300 సహాయం చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. యాసంగిలో 4 కోట్ల క్వింటాళ్ల బియ్యం పండినా.. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1000-1200 కోట్లు భరిస్తే సరిపోతుందంటూ ఓ కాకి లెక్క వేశారు. రాష్ట్రం దివాలా తీసిందని, రూ.వెయ్యి కోట్లు భరించలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాద్ధాంతం చేస్తున్నదంటూ ఇష్టంవచ్చినట్టు మాట్లాడారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
ధాన్యం మొత్తం కొంటామని మిల్లర్ల సంఘం ప్రకటన చేసిందా? లేక బండి సంజయ్ లేక అర్వింద్ వారితో మంతనాలు జరిపారా? రూ.300 ఇస్తే చాలు.. మేం ఎగుమతి చేసుకొంటామని ఏ మిల్లరు చెప్పారు? ప్రభుత్వాన్ని కోరారా?
రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఉంటే.. రైతుబంధు కింద రూ.14వేల కోట్లు పెట్టుబడి సాయం ఎలా చేస్తున్నది?
వెయ్యి, 1200 కోట్లతో సమస్య పరిష్కారమైతే.. ఏడాదికాలంగా కేంద్రం కానీ, కేంద్ర మంత్రి కానీ.. సోకాల్డ్ బండి సంజయ్ కానీ ఎందుకు మాట్లాడలేదు? మొత్తం ధాన్యాన్ని మిల్లర్లే కొనేటట్లయితే.. కేంద్రానికి కూడా భారం ఉండదు కదా.. ఎగుమతుల అంశం కేంద్రం పరిధిలోనిదైనప్పుడు రూ.1200 కోట్లు పెద్ద ఖర్చేమీ కాదు కదా.. ?
రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నా.. రైతులను ఉసిగొల్పి, వరి వేయించి, ప్రతి గింజ కొంటాం అని రైతులకు మాయమాటలు చెప్పి తప్పించుకు తిరుగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గానీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గానీ ఏరోజు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. ఒకసారి ప్రతి గింజా మేమే కొంటాం.. సీఎంను పట్టించుకోకండంటారు.. ఇంకోసారి రా రైస్ కొంటామని చెప్తారు.. ఇప్పుడేమో.. కేంద్రం కాదు.. రాష్ట్రంలోని మిల్లర్లంతా ప్రతి గింజనూ కొనడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తారు.. తెలంగాణ రైతులు వీళ్లను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. ‘క్లారిటీ ఉన్నదా?’ అని.
మిల్లర్లు ధాన్యం కొనడానికి రెడీగా ఉన్నారని సంజయ్ కొత్త పాట పాడటం వెనుక మతలబు ఏమిటి? కేంద్రం కొనబోదని చెప్పినట్టేనా?
రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తి మాత్రమే అంటున్న సంజయ్.. మరి కేంద్రం నేరుగా రైతులనుంచి వడ్లు సేకరించవచ్చు కదా (పంజాబ్ మాదిరిగా) వడ్లు సేకరించిన తరువాత మిల్లర్లకిచ్చుకొంటారో.. ఎగుమతి చేసుకొంటారో.. ఎక్కడ అమ్ముకొంటారో కేంద్రం ఇష్టం. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఏమున్నది?