Raja Singh | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రిని బీజేపీలోని కొందరు మఖ్య నేతలు రహస్యంగా కలుస్తారు. రహస్య సమావేశాలు పెడితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందా? రహస్యంగా భేటీ అవుతున్న ఆ నేతలకు బీజేపీ అధిష్ఠానం రిటైర్మెంట్ ఇస్తేనే పార్టీకి మంచి రోజులొస్తాయి. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త ఇదే కోరుకుంటున్నారు’ ఇవీ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం కొందరు తన సొంత పార్టీ నేతలపై చేసిన సంచలన వ్యాఖ్యలు.
ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ స్నేహ‘హస్తం’పై గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు చేస్తున్న విమర్శలు నిజమేనని తేలింది. సీఎం రేవంత్‌రెడ్డితో కొందరు బీజేపీ నేతలు అంటకాగుతున్నారనే విషయం రాజాసింగ్ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందమూ బట్టబయలైంది. ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుండగానే, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీలో దుమారం రేపాయి. మరోవైపు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించకుండా సైలెంట్ అవడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నది.
కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయినా, ఎస్ఎల్బీసీ ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నా, రాష్ట్రం నుంచి ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నా.. కాషాయ పార్టీ నేతలు మౌనం వహించడం చర్చనీయాంశం అవుతున్నది. హైడ్రా పేరిట పేదలు, మధ్యతరగతి వర్గాలపై రేవంత్ సర్కారు ఉక్కపాదం మోపుతున్నా, రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా, రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా.. ఆ పార్టీ నేతలు నోరు మెదపడమే లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నది.
హామీలను మాత్రం విస్మరించింది. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయినా రాష్ట్రంలో బీజేపీ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. బీజేపీ నేతలు ప్రజల సమస్యల కన్నా సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర బీజేపీలో ఇంత జరుగుతున్నా.. పార్టీ హైకమాండ్ దృష్టి సారించకపోవడం వెనుక బడే భాయ్, ఛోటే భాయ్‌కి ఉన్న సత్సంబంధాలే కారణమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
శాసనసభ సమావేశాల్లో కూడా పార్టీ శాసనసభాపక్షం ఫ్లోర్ కోఆర్డినేషన్లో ప్రతిపక్షాలతో కాకుండా కాంగ్రెస్‌తో చేసుకుంటున్న సమన్వయమే ఎక్కువగా ఉంటున్నదని, అధికార పార్టీ విధానాలకు మద్దతు ఇస్తున్నట్టుగానే వారి శైలి ఉంటున్నదన్న విమర్శలు కూడా తొలి నుంచి ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు పార్టీ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని, కానీ, పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారని విశ్లేషకులే చెప్తున్నారు.