హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): భారతదేశ సర్వోన్నత చట్టసభ కోసం నూతనంగా నిర్మించిన భవనానికి రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్ పేరుపెట్టాలని కేంద్రానికి నివేదించే కీలక తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు
ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చాంశమైంది. చరిత్రాత్మకమైన తీర్మానంపై చర్చలో పాల్గొనడం బీజేపీ నేతలకు ఇష్టం లేదా? అని గుసగుసలు వినిపించాయి. కేం ద్రంలోని అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆయన బయటకు వెళ్లిపోయారని బీజేపీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి కీర్తికిరీటం లాంటి పార్లమెంటు నూతన భవనానికి రా జ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసే తీర్మానంపై కేంద్రంలోని అధికార పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుడు చర్చలో పాల్గొనకపోవడం ఎబ్బెట్టుగా కనిపించింది.
ఒక సభ్యుడు మతవిద్వేషాలు రెచ్చగొట్టే కేసులో అరెస్టయ్యారు. మరో సభ్యుడు సభాపతి గురించి విమర్శలు చేసి సస్పెండయ్యారు. మిగిలిన ఒక్క సభ్యుడు రఘునందన్‌రావు చర్చ జరిగే సమయంలో సభలో లేకుండా పోయారు. దీని వెనుక ఏదో మతలబు ఉన్నదన్న మాటలు అసెంబ్లీ లాబీ లో వినిపించాయి. ఈ అంశంపై మాట్లాడలేక బీజేపీ పలాయనం చిత్తగించిందని అంటున్నారు. కేంద్రంలోని అధికారపార్టీ పెద్దలు పదేపదే అంబేద్కర్ నామస్మరణ చేస్తారని, వారికి ఆ మహానుభావునిపై నిజమైన భక్తి లేదని, అందుకు ఆ పార్టీ సభ్యుని తీరే అద్దం పడుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికను తెచ్చిపెట్టి సీఎం కేసీఆర్‌ను రాష్ర్టానికి పరిమితం చేశామని సంబురపడిపోతున్న బీజేపీ నేతలకు అంబేద్కర్ తీ ర్మానం గొంతులో పచ్చివెలక్కాయలా తయారైందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ర్టాల అసెంబ్లీలు ఇదే బాటపడితే జాతీ య స్థాయిలో బీజేపీ ఇరకాటంలో పడడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తున్నది.