హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు త్వరలో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తాయని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడారు. ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో ఆస్తి, ప్రాణనష్టం జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
నష్టం వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా నేరుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు, శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నివేదిక ఆధారంగా కేంద్రం తగిన సాయం అందిస్తుందని వెల్లడించారు.