హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : రాజకీయ ఉద్దేశంతోనే జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెట్టారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మొత్తం తంతు చూస్తుంటే జగన్నాటకం లాగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. నివేదికను చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. 665 పేజీల నివేదికను ఉదయం ఇచ్చి మధ్యాహ్నం వేళ అది కూడా ఆదివారం చర్చకు పెట్టడం ఏమిటి? దీనికి వెనుక ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు.
ఈ రిపోర్టు చెల్లదని బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారని, ప్రభుత్వం మరో వాదన వినిపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికారపక్షం వైఖరికి నిరసనగా బీజేపీ శాసనసభా పక్షం వాకౌట్ చేసింది. మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలందరూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ మాత్రం సభలోనే ఉండడం చర్చనీయాంశమైంది. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.