హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రైతు భరోసాపై స్పష్టత లేదని, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని విమర్శించారు. పెన్షన్ పెంపు, ఆరు గ్యారెంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తాను లేవనెత్తిన పలు అంశాలపై స్పందించకపోవడం ప్రభుత్వం తప్పు చేసిందనే దానికి నిదర్శనమని తెలిపారు. హెటిరో సాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, సివిల్ సప్లయ్ అక్రమాలపై ఆధారాలు బయటపెట్టినా చర్యలు లేవని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వ్యవహారంలో ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సీఎం రేవంత్ నియోజకవర్గంలోని కొడంగల్ లిఫ్ట్ టెండర్ల గోల్మాల్ సంగతేమిటని మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్ర భుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.